జగదానంద కారకా
రాగం:నాట
తాళం:ఆది
కృతి:త్యాగరాజ
Aa: S R3 G3 M1 P D3 N3 S
Av: S N3 P M1 R3 S
పల్లవి
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
అనుపల్లవి
గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల (సుగుణాకర సురసేవ్య భవ్య దాయక)
(జగదానంద)
చరణం 1
అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరా నేక
చరణం 2
నిగమ నిరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సంహరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రి యుగ
చరణం 3
ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ వా-
గీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
చరణం 4
పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
చరణం 5
సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫల దానా సమాన గాత్ర శ-
చీపతి నుతాబ్ధి మద హరానురా గరాగ రాజిత కథా సారహిత
చరణం 6
సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరనావ గుణా సురగణ మద హరణ సనాతనా జనుత
చరణం 7
ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప వాసవరిపు జనకాంతక కళా
ధరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
చరణం 8
కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
చరణం 9
పురాణ పురుష న్వరాత్మజా శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణా నఘ పరాశర మనోహరా వికృత త్యాగరాజ సన్నుత
చరణం 10
అగణిత గుణ కనక చేల పాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సు-కవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ నీర
నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
(జగదానంద)
ఈ కీర్తనను మీరిక్కడ వినవచ్చు
ఈ కీర్తన వింటున్నప్పుడు నా మదిలో మెదిలే భావాలు
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
జగముల ఆనందమునకు కారకుడవు,సీతమ్మ తల్లికి ప్రాణ నాధుడవైన నీకు జయము
గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల (సుగుణాకర సురసేవ్య భవ్య దాయక).
సత్కులములో(సూర్యవంశంలో)జన్మించి రాజులందరికి రాజైన చక్రవర్తివై,సుగుణాలకు నిలువెత్తు రూపమై (సుగుణాభిరాముడవై),పరమాత్ముడవై దేవతలచే సేవలందుకొని లోకాలన్నింటికీ ఎల్లప్పుడు అభయమ్ము నిచ్చే రామచంద్రా నీకు జయము.
అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరా నేక
దేవతలలో తారకల నడుమ చంద్రునిలా వున్న నీవు పరిపూర్ణుడవు.తప్పులెరుగని వాడవు.సురలకు కల్పవృక్షము వంటివాడవు.పాలు పెరుగు నిండిన కుండలను,గోపికల వస్త్రములను అపహరించటములో నేర్పరివి.సుందరమైన వదనమును కలిగినవాడావు.తియ్యనైన పలుకులను గల్గినవాడవు.గోవులను కాచిన లక్ష్మీ వల్లభా! నీవు ఆనంద స్వరూపానివి.శాశ్వతుడవు.ఎల్ల వేళలా అనేక విధములుగా శుభములనిచ్చువాడవు.
ఈ చరణములో కృష్ణావతారమును ఎంతో రమణీయంగా వర్ణించారు శ్రీ త్యాగరాజస్వామి.
నిగమ నిరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సంహరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రి యుగ
నిగమ నిరజామృతజ పోషకా
వేదములనెడి కమలముల నుండి జనించిన వేద సారమనే అమృత పలుకులను పొషించేడి వాడా!(లేక మత్సావతారమై వేదములను రక్షించిన వాడని అర్ధము కూడా తీసుకోవచ్చును అన్న భావన నాకు కలిగింది).
ఆనిమిశవైరి వారిద సంహరణ
మేఘములను పారద్రోలు వాయువుని వలే దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించెడి వాడా!
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రి యుగ
గరుత్మంతుని వాహనముగా జేకొన్నవాడా!సత్-కవుల హృదయములను ఆలయముగా చేసుకుని నివసించేడివాడా!లెక్క తెలియని (వానరులు)అనుచరులను కలిగిన వానర ప్రభువు సుగ్రీవునిచే పూజలందుకున్నాయి కదా నీ పాద పద్మములు.
ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ వా-
గీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
ఇంద్ర నీలమణి సన్నిభమైన దేహదారుఢ్యము గలవాడా!సుర్యచంద్రులను నీ నయనాలుగా జేకొన్న వాడా!
మా మనస్సుకు,బుద్ధికి అంత సులువుగా అందనివాదా(అప్రమేయా)! వాణీపతి అయిన బ్రహ్మదేవునకు తండ్రివి!సకలమునకు ప్రభువువు!తెల్లని శేషునిపై శయనించెడివాడవు.శమనము(మృత్యువు)నకు అధి దేవతలైనా పరమ శివుడు,యముల చే పూజలనందుకొనెడివాడవు.
పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
పాద విజిత మౌని :నీ పాద ధూళిచే అహల్యను గౌతమ మహర్షి శాపమునుండి విముక్తురాలను చేసావు.
వర మంత్ర గ్రహణ లోల :బల అతిబల అనెడి మంత్రములను విశ్వామిత్ర మహర్షి వద్ద గ్రహించినవాడవు(నేర్చుకున్నవాడవు).పరమ ప్రశాంతమైన చిత్తమును కలిగిన సీతా నాయకా !బ్రహ్మాది అఖిల దేవతలకు,లోకములకు ఆనందమును,వరములిచ్చే జగన్నాధుడవు.
సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫల దానా సమాన గాత్ర శ-
చీపతి నుతాబ్ధి మద హరానురా గరాగ రాజిత కథా సారహిత
సృష్టి స్థితి అంత్యములకు కారకుడవు,పరమాత్ముడవు.అమితమైన వరములొసంగే విభుడవు నీవు.అసమానమైన దేహము(గత్రము అంతే దేహము అనే అర్ధము కూడా వున్నది) గలవాడవు. శచీపతైన ఇంద్రుని కుమారుడైన వాలిని సంహరించి అతని గర్వమును,సముద్రునిపై ఆగ్రహించి అతని అహంకారమును అణచితివి.అనురాగము-మోహములు ప్రధానముగానున్న రామాయణ కథ సారానివి.
సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణా సురగణ మద హరణ సనాతనా జనుత
సజ్జనుల హృదయామనెడి సముద్రానికి చంద్రుడవు.పుష్పక విమానమున అధిరోహించినవాడవు.హనుమంతుడు తన కమలాల వంటి కరములతో నీ పాదములొత్తెను.తమోగుణ సంపన్నులు,ధుష్ట స్వభావులు(అవ గుణ) అయిన రాక్షసులను(అసుర గణ) శిక్షించిన పరమాత్ముడవైన నిన్ను బ్రహ్మ పూజించెను.
ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప వాసవరిపు జనకాంతక కళా
ధరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
ఓంకారమనే పంజరంలో నివసించే చిలుకవు.త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రూపాలు నీవి.ఇంద్రజిత్తు తండ్రిని సంహరించిన వాడవు.పరమ శివునకు ఆప్తుడవు.దయా సముద్రుడవు.నిన్ను నమ్మి నీకు శరణముజొచ్చిన వారికి అభయమొసంగే ప్రభుడవు.సుజ్జనులకు సంతోష ప్రదాతవు.రాగ ద్వేషాదులన్నింటికీ అతీతుడవు.వేదాల సారమే నీవు.
కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
నీ కరమునకు శరములు అలంకారముగానున్నవి.అసురుల మదమును అంతము చేసినవాడవు.సజ్జనులను,దేవతలను రక్షించిన వాడవు. వాల్మికము నుండి పుట్టీ నీ చరితమును రాసి నీ నామమును కథను నలుదిశలా వ్యాపింపజేసిన వాల్మికి మహాముని నీ భక్తుడు.నీవే త్యాగరాజుకు భగవంతుడవు.
పురాణ పురుష న్వరాత్మజా శ్రిత పరాధీన ఖర విరాధ రావణ
విరావణా నఘ పరాశర మనోహరా వికృత త్యాగరాజ సన్నుత
పురాణ పురుషుడవు(అన్ని యుగాలలోను,అందరికి భగవంతుడవు).దశరధునికి తనయుడవు.నిన్ను ఆశ్రయించేవారికి తల్లి తండ్రి,గురువు,దైవము అన్నీ నీవే.ఖరధూషణులు,విరాధుడు,రావణాది రాక్షసులను సంహరించినవాడవు.పాపములేరుగని పరాశరాది మహర్షులకు మనోహరుడవు,త్యాగరాజునిచే వందనములందుకొనెడి వాడవు.
అగణిత గుణ కనక చేల పాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సు-కవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ నీర
నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
అనంతమైన(అగణితము=లేక్క పెట్టలేని) సుగుణాలను కలిగిన వాడవు.బంగారమయమైన పట్టు వస్త్రాలను ధరించినవాడవు.ఒక్క బాణముతో ఏడు సాల వృక్షములను కూల్చినావు.ఎర్రని పాదపద్మములు కలవాడవు.అపారము ,అద్భుతమైనా మహిమలు కలవాడవు.సజ్జనులైన కవి హృదయాలలో నివసించెడి వాడవు.సకల దేవతాది మునులకు,సజ్జనులకు,శుభము కూర్చేడి వాడవు.లక్ష్మీ వల్లభుడవు.పాపమనే గజమునకు నరసింహ స్వామివి.త్యాగరాజాది భక్తులచే పూజలను అందుకునే జగన్నాధుడవు.

